విదేశీ అవకాశాలను వదిలి స్వస్థలంలో యోగా సేవలు
ఉడ్‌పేటలో ‘రాజ్ యోగా’ కేంద్రం ద్వారా ఆరోగ్య చైతన్యం
52 మందితో శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న గోవిందరాజు
యోగాసనాలు చేస్తున్న రాజు
తుమ్మపాల : ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని చెబుతూ అనకాపల్లి ఉడ్‌పేటకు చెందిన ప్రముఖ యోగా గురువు బి.గోవిందరాజు యోగా చైతన్యాన్ని విస్తరిస్తున్నారు. గతంలో చైనాలో యోగా శిక్షకుడిగా సేవలందించిన ఆయన, విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ స్వస్థలంపై ఉన్న ప్రేమతో తిరిగి వచ్చి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉడ్‌పేటలో ‘రాజ్ యోగా’ కేంద్రాన్ని స్థాపించారు.
యువత ఒత్తిడిని జయించేలా..
యువతలో మొబైల్ ఫోన్, కంప్యూటర్ వినియోగం కారణంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని గోవిందరాజు తెలిపారు. వృద్ధులకు శారీరక చురుకుదనం, మహిళలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఆరోగ్యకర జీవనంపై అవగాహన
రాజ్ యోగా కేంద్రంలో యోగా ఆసనాలతో పాటు ప్రాణాయామం, ధ్యానం, ఒత్తిడి నియంత్రణ పద్ధతులు, ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన శిక్షణతో అనేక మంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక శిబిరానికి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మందికి యోగా ప్రయోజనాలు చేరవేయాలని గోవిందరాజు లక్ష్యంగా పెట్టుకున్నారు.
గోవిందరాజు పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమందికి యోగాసనాలపై శిక్షణ ఇచ్చి గురువులను తయారు చేశారు. అనకాపల్లిలో పదేళ్ల క్రితం మొదలుపెట్టిన యోగా కేంద్రం కొనసాగిస్తూ చైనాలో యోగాగురువుగా అవకాశం రావడంతో మూడేళ్ల పాటు అక్కడ యువతకు వివిధ యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాతృభూమిపై అభిమానంతో దేశానికి తిరిగివచ్చి యోగాసనాల ద్వారా స్థానికులకు అవగాహన చేసి ఆరోగ్యవంతుల్ని చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే జాతీయ అంతరాతీయ పోటీలలో పాల్గొనేలా యువతకు శిక్షణ ఇస్తున్నారు.
యోగాతో ఆరోగ్య బాట
నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ దోహదం చేస్తుంది. ప్రతి ఇంటిలో యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం’’ అనే సందేశంతో ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి.
– బి.గోవిందరాజు, యోగా గురువు, వ్యవస్థాపకుడు–రాజ్ యోగా కేంద్రం
అనకాపల్లి (ఉడ్‌పేట) రాజ్ యోగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువత


