అచ్యుతాపురం రూరల్ : దళితుల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఎస్సీ సెల్ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శనివారం మండల వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు తట్టా రాజు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయంలో దళితుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూ వివాదాలు, అసైన్డ్ భూములు, జిరాయితీ భూములకు సంబంధించిన సమస్యలను వివరించారు. ముఖ్యంగా దళిత రైతుల భూములు పెత్తందారుల ఆధీనంలో ఉన్నాయని ఫిర్యాదు చేయగా, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సీతారాం అన్నారు. ఈ అంశాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్‌ఈజెడ్ జోనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన, ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను వినియోగించి వీధులు, ఇతర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. మార్టూరు గ్రామంలో పరిశ్రమల కారణంగా భూములు కోల్పోయిన దళిత రైతులు, నిరుద్యోగులకు ఏటీసీ టైర్స్ యోకోహమా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యానికి సూచిస్తామన్నారు. కార్యక్రమంలో అచ్యుతాపురం తహసీల్దార్ డి.శ్రీను, సీఐ చంద్రశేఖర్ రావు, దళిత నాయకులు తట్టా పెంటయ్యనాయుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి అప్పారావు, మండల కార్యదర్శి మైలపల్లి రాహుల్, కోశాధికారి ఈరిగల సంతోష్ కుమార్, తట్టా ధనలక్ష్మి, ఊషా నాగరాజు, డీవీఎమ్‌సీ సభ్యుడు ఎండీ రాజు, సహదేవుడు, బోణి గణేష్ పాల్గొన్నారు.
ఎంపీడీవో గైర్హాజరుపై మండల సభ్యుల ధ్వజం


