స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాలి

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

పాయకరావుపేట : స్ధానిక శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థలకు శనివారం పతంజలి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పతంజలి విశ్వ విద్యాలయ ఉపకులపతి డా.ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల్లో వ్యర్థాల నుంచి పర్యావరణ రక్షణ చేస్తూ పునర్వినియోగం చేసే విధానంపై విద్యా సంస్థల యాజమాన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. శ్రీ ప్రకాష్‌ విద్యా సౌథంలో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమం, ఆయుర్వేద చికిత్సాలయ జౌషధ వనం, నూతనంగా నిర్మించిన పరిపాలనా విభాగ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా శక్తిని, యోగా ద్వారా ఐక్యతను చాటి చెప్పాలని కోరుకుంటున్నామన్నారు. విద్యార్థి దశలోనే స్వయం సమృద్ధి, సంపాదన గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యమన్నారు. విదేశాల్లో ఎంత ధనవంతుడైనా వారి పిల్లలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత స్వయం సమృద్ధి సాధిస్తారని, కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదన్నారు. ఏ పిల్లలైతే ఎక్కువగా సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారో వారు ఎప్పటికీ ఒత్తిడికి గురి కారని తెలిపారు. మున్ముందు పతంజలి స్కూల్లో కూడా శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్ధల సహకారంతో సర్క్యులర్‌ ఎకానమీ ప్రాజెక్ట్‌ మోడల్‌ను అమలు చేద్దామనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఆచార్య బాలకృష్ణను నరసింహరావు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌. అధ్యక్షులు కంటిపూడి నరేంద్రబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement