మాడుగుల రూరల్ : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు వివిధ సెంట్రల్ యూనివర్శిటీల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధించారని, కళాశాల ప్రిన్సిపాల్ పి.జయ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల బీఎస్పీ విద్యార్థిని పి.మల్లేశ్వరి సెంట్రల్ యూనివర్సీటీ ఆఫ్ తమిళనాడులో ఎంఏ ఇంగ్లిష్‌లో సీటును సాధించగా, కళాశాలకు చెందిన మరో బీఏ విద్యార్థిని, సి.హెచ్. ఏసుకుమారి, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళలో ఎంఏ ఇంటర్‌నేషనల్ రిలేషన్సు అండ్ పోలిటికల్ సైన్సు విభాగంలో సీటు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా అధ్యాపకుల నిరంతర శిక్షణ పర్యవేక్షణతో ఈ విజయాన్ని సాధించగలరన్నారు. ఈ విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.


