యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

అరకులోయ టౌన్‌ (పాడేరు రూరల్‌): యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ నిషాంతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండలంలోని మాడగడ సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌లో శనివారం ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధి కూలీలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సూచించారు. యోగా శిబిరానికి భారీగా జనాన్ని తరలించిన అధికారులు, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఉదయం 5.30 గంటలకే విద్యార్థులను తీసుకువచ్చిన నిర్వాహకులు, యోగా ముగిసే వరకు వారికి అల్పాహారం అందించలేదు. ఆకలితో అలమటించిన విద్యార్థులకు కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ అధికారులు అందరిలా యోగాసనాలు వేయకుండా, నిలబడిన చోటే వింతగా యోగా చేసి ఆశ్చర్యపరిచారు. ఇతరులు యోగాసనాలు వేస్తుంటే, వీరు మాత్రం కార్యక్రమం ఆద్యంతం నిలబడే ఉండిపోవడం అక్కడున్న వారిలో చర్చకు దారితీసింది.

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలే లక్ష్యం: పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ప్లాస్టిక్‌ నిషేధానికి సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement