కారు చీకట్లో మృతదేహంతో 5 కి.మీ | - | Sakshi
Sakshi News home page

కారు చీకట్లో మృతదేహంతో 5 కి.మీ

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

సీలేరు : ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల దయనీయ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ, మారుమూల గ్రామాల ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో బాధపడేవారిని, గర్భిణులు, మృతదేహాలను సైతం డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గూడెంకొత్తవీధి మండలం దేవరకొండ పంచాయతీకి చెందిన మురళి ఎరయ్య చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు. అయితే అదే రోజు కురిసిన భారీ వర్షాలకు చాపగెడ్డ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై వరదనీరు ప్రవహించింది. రాత్రి 8 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచిచూసినా వరద ప్రవాహం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు గత్యంతరం లేక మృతదేహాన్ని అంబులెన్స్‌ నుంచి దించారు. అర్ధరాత్రి సమయంలో సెల్‌ఫోన్‌ వెలుతురులో మృతదేహానికి డోలీ కట్టి, ప్రమాదకరమైన వాగును దాటించి, అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, రవాణా సదుపాయాల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement