చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆళ్ల అప్పలస్వామికి స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెరకు ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ విధుల్లో ఉన్నా బాధ్యతాయుతంగా పనిచేయడం తన వృత్తి ధర్మమని, చింతపల్లిలో పనిచేసిన అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్నప్పటికీ, ఈ సంస్థకు తన సేవలు ఎప్పుడూ అందుతాయని హామీ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఆయన నేతృత్వంలో జరిగిన పరిశోధనలు, సంస్థ అభివృద్ధికి చేసిన కృషిని సహచర శాస్త్రవేత్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, సందీప్ నాయక్, వెంకటేష్, ఏరువాక విస్తరణ శాస్త్రవేత్త ప్రదీప్‌కుమార్, గూడెంకొత్తవీధి ఏవో గిరిబాబు, టీచర్ అసోసియేట్ బాపూజీ, సిబ్బంది, సేంద్రియ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


