కలెక్టర్ నిశాంతి
పాడేరు: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జిల్లా అధికార యంత్రాంగం పాలనను కొనసాగిస్తోందని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన విశ్వాస్, వికాస్, జన కల్యాణ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల సగటు తలసరి ఆదాయం రూ.2,57,411లకు పెరిగిందని, అలాగే జిల్లా స్థూల దేశీయోత్పత్తి రూ.18,300 కోట్లకు చేరుకుందని వెల్లడించారు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.751.91 కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.145.41 కోట్లు, పీఎం జన్‌మన్ పథకం రూ.312 కోట్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు 2,78,332 పంపిణీ జరిగిందన్నారు.డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 703 మందిని నియమించినట్టు తెలిపారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 317 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,410 మంది సభ్యులకు రూ.26 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి పథకం కింద 210 సంఘాలకు చెందిన 692 మంది సభ్యులకు రూ.6 కోట్ల చెక్కులను ఆమె అందజేశారు. అలాగే, అర్హులైన రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్ గంగులయ్య, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


