జి.మాడుగుల: మండలంలోని బూసిపల్లి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల భవనాన్ని ఆర్‌ఎస్ స్వేచ్ఛ సొసైటీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సొసైటీ ప్రతినిధులు, వెంటనే స్పందించి పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చారు. గ్రామస్తుల సహకారంతో సొసైటీ ప్రతినిధులు పాఠశాల భవనానికి సుందరంగా రంగులు వేయించడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, దుస్తులు, పుస్తకాలు, పలకలు, వాటర్ బాటిళ్లు వంటి సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు కంటా స్వాతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నాగేంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధి కోసం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ఆమె అభినందించారు. సొసైటీ సేవలను గ్రామస్తులు కొనియాడుతూ, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దత్తత తీసుకుని అభివృద్ధి చేసినఆర్‌ఎస్ స్వేచ్ఛ సొసైటీ


