రోలుగుంట: మండలంలోని బుచ్చింపేట ఎర్రచెరువు ఆక్రమణలను తొలగించి తమ భూములకు సాగునీరు అందించి ఆదుకోవాని ఆయకట్టుదారులు కోరుతున్నారు. దీనిపై కలెక్టరేట్‌తోపాటు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినట్టు గురువారం వారు తెలిపారు. బుచ్చింపేట గ్రామంలో వడ్డిప పోయే రోడ్డును ఆనుకొని సచివాలయం పక్కనున్న ఎర్రచెరువు ఆక్రమణలకు గురవుతోంది. చెరువు కింద 30 మంది రైతులకు చెందిన 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. చెరువు సమీపంలోనే భక్తమండలి ఆరు మాసాల క్రితం కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణ పనులు చేపట్టింది. ఇటీవల ఎండలకు చెరువు ఎండిపోవడంతో ఆక్రమణదారుడు మట్టిని చెరువులోకి డంపింగు చేసి దిబ్బ చేసుకుంటున్నాడు. డంపింగు చేసిన మట్టి ఆలయం పక్కన, వేరొక చోట వేసి దిబ్బ చేశాడు. దీనిని ఆసరా చేసుకొని మరి కొందరు చెరువు గర్భంలోనే మరికొన్ని నిర్మాణాలు చేపట్టేందుకు ఆలోచనలు చేసుకుంటున్నారు. ఇలాగైతే చెరువు గర్భం తగ్గిపోయి తమ పంట భూములకు సాగునీరుకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేయించి, సరిహద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలను నియంత్రించాలని ఆయకట్టు రైతులు ఉలబాల వెంకటరమణ, సోమినాయుడు, చిటికెల సత్తిబాబు, అల్లు రాంబాబు తదితరులు కోరుతున్నారు.


