నర్సీపట్నం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని డీఎస్పీ పి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్న యువతి డ్యూటీలో ఉంటూ ఈ నెల 16వ తేదీ రాత్రి పనినిమిత్తం ఇంటికి వెళ్లి తిరిగి డ్యూటీకి వస్తుండగా అప్పన్నదొరపాలెం వద్ద ఆమెను అడ్డగించి ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పెదబొడ్డేపల్లికి చెందిన కె.హరి(30), పి.కుమార్(42)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు.ఇద్దరిలో ఒకరిపై రౌడీషీట్ కొనసాగుతోందన్నారు. ఇద్దరుపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. టౌన్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు దౌర్జన్యాలు, భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. రోడ్లపై మద్యం సేవించి హల్‌చల్ చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని, ప్రవర్తనలో మార్పు రాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ గఫూర్, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


