సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో చంద్రబాబు విఫలం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో చంద్రబాబు విఫలం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

జిల్లాలో 4 సుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేసిన ఘనతకూటమి ప్రభుత్వానిదే

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ధ్వజం

దేవరాపల్లిలో ఘనంగా వ్యవసాయ కార్మిక జిల్లా మహాసభలు

దేవరాపల్లి: పేదల పక్షాన ఎర్ర జెండా నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. దేవరాపల్లి ఉషోదయ కాన్సెప్ట్‌ స్కూల్‌ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలు జిల్లా అధ్యక్షుడు వి.సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగాయి. సభా వేదిక వద్ద ముందుగా పుచ్చపల్లి సుందరయ్య, ఏచూరి సీతారాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరైన రైతులు, కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు స్థలం ఇస్తానని హామీ ఇచ్చి దళిత, గిరిజనుల భూములు లాక్కోవడం జరుగుతుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వేలాది ఎకరాల భూములను పేద రైతుల నుంచి లాక్కోని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఎర్ర జెండా కృషితో వచ్చిందేనని, దీనిని నిర్వీర్యం చేసేందుకు పేరు మార్చి కూలీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని ఈ నెల 20న విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రాగా మారుస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారని, ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎర్ర జెండా నాయకులు పోటీ చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు సుగర్‌ ఫ్యాక్టరీలు మూసివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని నాన్‌ షెడ్యూల్‌ మండలాలను ఐదో షెడ్యూల్‌ మార్చా లని డిమాండ్‌ చేస్తూ మహా సభలో తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. జీడి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోడు ఫారెస్టు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమణలకు గురైన పేదల భూములు తిరిగి ఇవ్వాలని, ఉపాధి హామీ పట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహాసభలలో తీర్మానం చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, రైతు సంఘం నాయుకులు గండి నాయన్‌బాబు, బి.టి.దొర, ఇరటా నర్సింహమూర్తి, గోవింద, కె. భవానీ, డి.శంకర్‌, సిహెచ్‌.దేముడు, గాడి ప్రసాద్‌, ఎం.ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు.వి.దొంగబాబు, నండా సన్నిబాబు, కె.నాయుడు, కె.దేముడు, సిహెచ్‌. చినదేముడు, జన్ని దేముడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement