● ఆరు నెలల్లో గ్రామం రూపురేఖలు
మార్చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
● నీటి మూటలా హామీ
● ఎగుడుదిగుడుగా రూ.కోట్లతో
నిర్మించిన రోడ్డు
● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు
● నిప్పులు చెరుగుతున్న గ్రామ గిరిజనులు
గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతం
నాణ్యత పాటించలేదు
రోడ్డు నాణ్యత లేకపోవడంతో భారీ వర్షం కురిస్తే కొట్టుకుపోయే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నప్పుడు కాంట్రాక్టర్ నిర్మించారు. వర్షాలు తగ్గిన తరువాత నిర్మించాలని గ్రామస్తులం ఎంత చెప్పనా వినిపించుకోలేదు. ఏమాత్రం నాణ్యత పాటించలేదు. దీనిపై అధికారులు దృష్టి సారించలేదు.
– కొర్రా రూప్ప, పెద్దపాడు
డుంబ్రిగుడ: సరిగ్గా ఏడాది క్రితం.. ఏప్రిల్ 7వ తేదీ. పోతంగి పంచాయతీలోని పెద్దపాడు గ్రామం జనసంద్రమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రామానికి విచ్చేసి, ఇక్కడి పీవీటీజీ గిరిజనులతో ముచ్చటించారు. ఆరు నెలల్లోనే పెద్దపాడు రూపురేఖలు మార్చేస్తాం.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’ అంటూ కొండంత ఆశలు కల్పించారు. కానీ, కాలం గిర్రున ఏడాది తిరిగినా.. అవి ఇప్పటికీ హామీలుగానే మిగిలిపోయాయి.
అస్తవ్యస్తంగా తారు రోడ్డు
డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా చాపరాయి జలపాతం నుంచి పెద్దపాడు వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి పీఎం జన్‌మన్ కింద రూ. 1.85 కోట్లు కేటాయించారు. ఏడు కల్వర్టులు నిర్మించారు. అయితే, వర్షాకాలంలో కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు చేయడంతో రోడ్డు ఎగుడుదిగుడుగా తయారైంది. ఖర్చు చేసిన రూ.కోట్లు గాలిలో కలిశాయే తప్ప, గిరిజనుల ప్రయాణ కష్టాలు మాత్రం తీరలేదు.
స్తంభించిన గృహ నిర్మాణం.. పిల్లర్లకే పరిమితం!
జన్‌మన్ పథకం కింద గ్రామానికి 36 ఇళ్లు కేటాయించారు. కేవలం బేస్‌మెంట్ వరకు మాత్రమే బిల్లులు మంజూరు కావడంతో ఇళ్లన్నీ పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. మొత్తం 36 ఇళ్లలో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే పూర్తయింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు రాకపోవడంతో, గూడు లేని గిరిజనులు గాలిలో దీపాల్లా మిగిలారు.
వంతెన లేని ప్రయాణం
వాగు అవతలి వరకు తారు రోడ్డు వేసిన అధికారులు, వాగుపై వంతెన నిర్మించడాన్ని విస్మరించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ వంతెన నిర్మిస్తే పెద్దపాడుతో పాటు కోసంగి, వర్రా, చొంపి గ్రామాలకు రవాణా సులభమవుతుంది. అరకులోయ, మాడగడ వ్యూ పాయింట్, సుంకరమెట్ట మీదుగా విశాఖకు దూరం తగ్గుతుంది. పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుంది.
వర్షం కురిస్తే ఇబ్బందులే..
పెద్దపాడులో బీటీ రోడ్డు నుంచి గ్రామం వెలుపలకు సీసీ రోడ్డు వేయకపోవడంతో బురదమయం అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి బావి నుంచి కుళాయిల ద్వారా అందిస్తున్నారు. వర్షాకాలంలో బావి పూర్తిగా కలుషితమవుతోంది. ఈ నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని గ్రామ గిరిజనులు వాపోతున్నారు. బావి స్థానంలో బోరు ఏర్పాటుచేస్తే కలుషితం సమస్య పరిష్కారం అవుతుందని వారు పేర్కొన్నారు.
చదువుకు దూరం.. అంధకారంలో గ్రామం
గ్రామంలో శాశ్వత పాఠశాల భవనం ఉన్నా అది ప్రారంభానికి నోచుకోలేదు. అంగన్‌వాడీ భవనం అసంపూర్తిగా వెక్కిరిస్తోంది. వాగు పొంగినప్పుడు ఉపాధ్యాయులు రాలేకపోతుండటంతో పిల్లల చదువు అర్థంతరంగా ఆగిపోతోంది. మరోవైపు పాతబడిన ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ లేక మురుగునీటి కంపు మధ్య గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దపాడులో ప్రగతి పరుగులు పెడుతుందని ఆశించిన గిరిజనులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకుంటారా? లేక పెద్దపాడు ప్రగతిని సెల్ఫీలకే పరిమితం చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వంతెన లేక ఇబ్బందులు
గెడ్డకు అవతల నుంచి తారురోడ్డు నిర్మించారు. గెడ్డపై వంతెన నిర్మించకపోతే రాకపోకలు ఎలా సాగిస్తాం. వంతెన లేక గృహ నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
– కొర్రా మలతిరావు, పెద్దపాడు
డిప్యూటీ సీఎం మాటలపై నమ్మకం పోయింది!
ఆరు నెలల్లో మార్చేస్తామన్న మాటలు నమ్మి మోసపోయాం. పవన్ కళ్యాణ్ కేవలం రోడ్ల శంకుస్థాపనల కోసమే గ్రామానికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం మా గ్రామం అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టదని అర్థమైపోయింది.
–స్థానిక గిరిజనుల ఆవేదన


