అరకు ఎంపీ తనూజ రాణి
ఎంవీపీకాలనీ (విశాఖ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర.. రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని అరకు ఎంపీ తనూజ రాణి అన్నారు. మహానేత చేసిన పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఎంవీపీ కాలనీలోని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు తదితరులతో కలిసి ఎంపీ తనూజరాణి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పనిచేసిన కాలం ఒక స్వర్ణయుగమని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ఆయన జనం మధ్యకు వెళ్లి, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక ప్రజారంజక పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు వైఎస్సార్ పాదయాత్ర ద్వారా పుట్టినవేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చేశాయని, ముఖ్యంగా గిరిజనులకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.


