స్నానాల సరదా.. ప్రాణాలు తీసింది | - | Sakshi
Sakshi News home page

స్నానాల సరదా.. ప్రాణాలు తీసింది

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

త్రిష, పవిత్ర, రత్నకుమారి మృతదేహాలు

సాక్షి, పాడేరు: ఆ ఇంట ఇటుకల పండుగ సంబరం నెలకొంది. పరీక్షలు ముగించుకుని వచ్చిన ఆడబిడ్డలతో ఆ ఇల్లు కళకళలాడింది.. కానీ, ఒక్క క్షణం జరిగిన అజాగ్రత్త ఆ కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. స్నానాల సరదా, సెల్‌ఫోన్‌ వీడియోల ముచ్చట ముగ్గురు గిరిజన యువతులను మృత్యుఒడికి చేర్చింది. హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దుల్లోని ములగుమ్మి జలపాతం వద్ద గురువారం జరిగిన ఈ విషాద ఘటన మన్యాన్ని కలిచివేసింది.

● హుకుంపేట మండలం జంబువలస గ్రామంలో అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి (16), మరో యువతి అంజలితో కలిసి సరదాగా గడిపేందుకు సమీపంలోని ములగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. ముగ్గురు యువతులు నీటిలో దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి గట్టు మీద నిలబడి వారిని సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తోంది. ఈ క్రమంలోనే లోతు తెలియక ఆ ముగ్గురూ జలపాతంలో మునిగిపోయారు. వారిని రక్షించే ప్రయత్నంలో అంజలి కూడా రాయిపై నుంచి జారిపడి గాయపడింది.

అస్తమించిన ఆశలు

మృతి చెందిన వారిలో ఇద్దరు విద్యార్థులు కావడం అందరినీ మరింత వేదనకు గురిచేస్తోంది. సాలెపు త్రిష హుకుంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రాసింది. సాలెపు రత్నకుమారి టెన్త్‌ పరీక్షలు రాసి, ఫలితాల కోసం వేచి చూస్తోంది. సెలవుల్లో తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుదామని ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు, ఇలా విగతజీవులుగా మారడంతో జంబువలస గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మా బిడ్డలు మళ్లీ వస్తారనుకున్నాం.. ఇలా విగతజీవులై వస్తారని ఊహించలేదు.. అంటూ తండ్రులు దేముడు, కొండ, చంద్ర గుండెలవిసేలా రోధించడం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది.

కేసు నమోదు

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుకుంపేట సీఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. యువతుల మృతదేహాలను వెలికితీసి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వేసవి సెలవుల్లో జలపాతాలు, నదుల వద్దకు వెళ్లే యువత, విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతు తెలియని చోట సాహసాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ములగుమ్మి జలపాతంలో పడి

ముగ్గురు యువతుల మృతి

తీవ్రంగా గాయపడిన మరో యువతి

స్నానాలు చేస్తుండగా ప్రమాదం

మృతులు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారు

శోకసంద్రంలో జంబువలస

పండగ వేళ విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement