
నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
పాడేరు : విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ సూచించారు. శుక్రవారం ఆయన పాడేరులో పర్యటించారు. పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామాన్ని సందర్శించారు. పీఎం జన్‌మన్ పథకంలో పీవీటీజీలకు అందజేస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని ఆయన లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం పాడేరు విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.విద్యుత్ బిల్లుల వసూళ్లు, ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలపై ఆరా తీశారు. విద్యుత్ బిల్లులు బకాయిలు త్వరగా వసూలు అయ్యేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. వర్షాకాలం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పుడు ముందుగానే పత్రిక ప్రకటన ద్వారా వినియోగదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయనను అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) ఎల్‌సీహెచ్ పాత్రుడు, ఫైనాన్స్ ఆఫీసర్ ఎ. శ్యామలరావు, పాడేరు డీఈ వేణుగోపాల్, రంపచోడవరం ఈఈ గాబ్రియల్, ఎంఆర్‌టీ ఈఈ చెల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ పృథ్వీతేజ్