
తల్లిపాలు శిశువుకు శ్రేయస్కరం
పాడేరు : తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, బిడ్డ ఎదుగుదలకు సంజీవనిగా పనిచేస్తుందని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ట్రైనీ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా తాగించాలన్నారు. ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. తల్లి పాలలో ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టోజ్, విటమిన్లు, ఇమ్యునోగ్లోబులిన్ బిడ్డ యొక్క సంపూర్ణ ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తి పెంపునకు తోడ్పడుతుందన్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. బిడ్డకు పాలు పట్టే విధానం, జాగ్రత్తలు, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.