
వినతులకే పరిమితం
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిది అరకులోయ మండలం బస్కీ పంచాయతీ బొందగూడ గ్రామం. గ్రామంలో 2011 నుంచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీఏలో నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ తదితర ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఏకంగా 11 సార్లు వినతిపత్రాలను అందజేశారు. కానీ సమస్యపై కనీస స్పందన లేదు. తమ సమస్యపై అధికారులు ఏ మాత్రం కూడా స్పందించడం లేదని సమస్యలు పరిష్కారం కానీ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించడం ఎందుకని కిల్లో రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
పాడేరు:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై ఆర్జీదారుల్లో రోజు రోజుకు నమ్మకం సన్నగిల్లుతుంది. ఒకే సమస్యపై అనేకసార్లు అధికారులకు వినతులు అందజేస్తున్నా పరిష్కారం కావడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. తాము అందజేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఐటీడీఏల నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ట్రైనీ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మాలత వివిద ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి 81 వినతులు స్వీకరించారు.
ఫిర్యాదులలో కొన్ని :
● హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతీ సెంబీ గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, పి.చిరంజీవి బురదమామిడి నుంచి సెంబీ గ్రామం వరకు పక్కా రోడ్డు నిర్మించాలని వినతిపత్రం అందజేశారు.
● కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ పంచాయతీ డేగలపాలెం గ్రామానికి చెందిన డి.సత్యనారాయణ, డి.గరువులు, డి.రాంబాబు వ్యవసాయ పనుల నిమిత్తం విద్యుత్ లైన్ వేయాలని వినతిపత్రం అందజేశారు.
● చింతపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు గిరిజనుల దుకాణాలు తొలగింపు సరికాదని, తక్షణమే వేరే చోట దుకాణాలు కేటయించాలని వినతిపత్రం అందజేశారు.
● హుకుంపేట మండలం తాటిపూడి పంచాయతీ నిమ్మలపాడు గ్రామానికి చెందిన రేగం రామన్న వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
అర్జీలిచ్చినా పరిష్కారం కాని సమస్యలపై గిరిజనుల ధ్వజం
మీ కోసం కార్యక్రమంపై ప్రజల్లో
సన్నగిల్లుతున్న నమ్మకం
అధికారులు పట్టించుకోవడం లేదు
మాది జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ మద్దివీధి గ్రామం. మా గ్రామంలో నేటి వరకు కనీస సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. వర్షకాలంలో గ్రామంలోని వీధులన్ని చిత్తడిగా మారుతున్నాయి. పారిశుద్య సమస్య తలేత్తుతుంది. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో ఏడుసార్లు అధికారులకు వినతులు అందజేశాను. కానీ తమ సమస్యపై అతిగతి లేదు.
– జి. రఘునాఽథ్, మద్దివీధి గ్రామం.
విన్నవించుకున్నా ఫలితం లేదు
మాది హుకుంపేట మండలం తాడేపుట్టు గ్రామం. మాది నిరుపేద కుటుంబం. నేటికి సొంత నివాస స్థలం లేదు. ఇంటి స్థలం కేటాయించాలని పాడేరు ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఏడాది కాలంలో మూడుసార్లు ఫిర్యాదు చేశాను. కానీ అధికారులు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈ కార్యక్రమంపై తనకు నమ్మకం లేదు.
– మర్రి బాబూరావు,
తాడేపుట్టు, హుకుంపేట మండలం.

వినతులకే పరిమితం

వినతులకే పరిమితం

వినతులకే పరిమితం