
వాల్తేర్ డివిజన్ రన్నింగ్ స్టాఫ్ నిరాహార దీక్ష
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్‌లో పనిచేస్తున్న రన్నింగ్ స్టాఫ్ తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మర్రిపాలెం డివైడీ క్రూ లాబీ వద్ద శుక్రవారం జరిగిన ఈ నిరసనలో సిబ్బంది పలు డిమాండ్లను రైల్వే యాజమాన్యం ముందుంచారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రన్నింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, రన్నింగ్ సిబ్బందికి కనీసం 120 కిలోమీటర్ల మైలేజీకి హామీ ఇవ్వాలని, ప్రస్తుగ్రెతం 16 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనివేళలను సైన్ ఇన్ నుంచి సైన్ అవుట్ వరకు 9 గంటలకు పరిమితం చేయాలని, రాత్రి షిఫ్టులు రెండు రోజులకు మించి కొనసాగించకూడదని, 36 గంటల్లోగా హోం స్టేషన్‌కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జె.సంపత్‌కుమార్ మాట్లాడుతూ వాల్తేరు డివిజన్ సిబ్బంది భారతీయ రైల్వేల్లో అత్యధిక ఓవర్ టైం పనిచేస్తున్నారని, అత్యధిక లోడింగ్ రికార్డు సాధించడంలో వారి కృషి కీలకమన్నారు. ఈ నేపథ్యంలోనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరాహార దీక్ష ఫలితంగా జీఎం కమిటీ వేశారని తెలిపారు. యూనియన్ ప్రతినిధులు, అధికారులతో కూడిన కమిటీ సమావేశం తర్వాత డిమాండ్లను 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం దీక్ష విరమించారు. కార్యక్రమంలో డివిజనల్ కోఆర్డినేటర్ టి.వి.మౌళి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.నరసింగరావు, డిప్యూటీ డివిజినల్ కోఆర్డినేటర్ ఎ.వెంకటరావు, అడిషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, ఇతర నాయకులు, రైల్వే కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రవికాంత్ పాల్గొన్నారు.