
గ్రామ సమస్యలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
చింతపల్లి: మండలంలో గల మారుమూల గ్రామాల సమస్యలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె శుక్రవారం మండలంలో లోతుగెడ్డ, కుడుమసారి, బలపం పంచాయతీ పరిధిలో గల గ్రామాలను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా లోతుగెడ్డ వంతెన నుంచి మూలకొత్తూరు వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రభుత్వం, అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు ఈ రహదారి చాలా ప్రధానమన్నారు. ప్రస్తుతం రాళ్లు తేలి అధ్వానంగా ఉన్న ఈ మార్గంలో రాకపోకలకు ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు చేపట్టక పోతే స్థానికులతో కలసి రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, వైస్ ఎంపీపీ వెంగళరావు, బలపం సర్పంచ్ రమేష్‌నాయుడు, ఎంపీటీసిలు మోహనరావు, సోని, నాయకులు బాబూరావు, రమణ, యెసేపు, శ్రీరాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.