
తక్షణం స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలి
పాడేరు : ఎన్నికల సమయంలో అరకు సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆదివాసీ నిరుద్యోగ సంఘ కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ హెచ్చరించారు. దీనిలో భాగంగా గురువారం పట్టణంలోని ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్ ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కిడారి లేకపోవడంతో ఆయన కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగుల పక్షాన పోరాటం :
పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు
ఆదివాసీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు వెల్లడించారు. ఆదివాసీ నిరుద్యోగ సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగులు గురువారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎన్నికల సమయంలో అరకు వచ్చిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే స్పెషల్ డీఎస్సీ ద్వార భర్తీ చేస్తామని, జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆదివాసీలను నిలువునా వంచించారన్నారు. ఆదివాసీ జీపు జాత కార్యక్రమానికి తాను అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ సంఘ జిల్లా కన్వీనర్ సాగిన సత్యనారాయణ, ఆదివాసీ నిరుద్యోగ సంఘ నాయకులు భవాని రాణి, కృష్ణం పడాల్, శంకర్, రాజంనాయుడు,రాజు, ప్రవీణ్, విష్ణుమూర్తి, వినయ్, చలపతి పాల్గొన్నారు.
చంద్రబాబు హామీలు అమలు చేయాలి
లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
ఆదివాసీ నిరుద్యోగ సంఘ కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ హెచ్చరిక
పాడేరులో జీసీసీ చైర్మన్
కిడారి శ్రవణ్‌కుమార్ ఇల్లు ముట్టడి
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేత

తక్షణం స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలి