
వట్టిగెడ్డ రిజర్వాయర్ నీరు విడుదల
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట అటవీప్రాంతంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటిని గురువారం నీటిసంఘం సభ్యులు పంటకాలువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆరు గ్రామాల పరిధిలోని 6 వేల ఎకరాలు ఆధారపడి ఉంది. రిజర్వాయర్ పూడికతో నిండిపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. మరోవైపు వర్షాభావం కారణంగా ప్రాజెక్ట్‌లోకి నీరు చేరలేదు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 16 అడుగులు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 8 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. వర్షాభావం కారణంగా వరి నాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌లో నీరు తక్కువగా ఉన్నందున రైతులు వంతుల వారీగా నీటిని మళ్లించుకుని పొదుపుగా వాడుకోవాలని నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ కోరారు. ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చీడిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.