
కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము దోపిడీ
ముంచంగిపుట్టు: కత్తులు,తుపాకులతో బెదిరించి సుమారు రూ.10 లక్షల పింఛన్ సొమ్ము ఎత్తుకు పోయిన సంఘటన కిలగాడ పంచాయతీ రాయిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కటారి మత్స్య రాజు పెదబయలు ఎస్‌బీఐ బ్యాంకులో పింఛన్ సొమ్ము రూ.17 లక్షల 53 వేల 200లు తీసుకొని, డిజిటల్ అసిస్టెంట్‌కు లక్షా 47 వేలు ఇచ్చి, మిగిలిన రూ.15 లక్షల 6 వేల 200లతో బైకుపై బయలుదేరారు. ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ చెరువుపాకల అయిన తన సొంత గ్రామానికి వస్తుండగా రాయిపల్లి గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని స్కూటీపై వచ్చి, బైకును అడ్డగించారు. కత్తులు, తుపాకులు చూపి చంపేస్తామని బెదిరించారు. అతని వద్ద ఉన్న పింఛన్ సొమ్మును లాక్కొని పారిపోయారు. అదే సమయంలో ఆ మార్గంలో బైకుపై వస్తున్న సీతగుంట పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు కు జరిగిన విషయాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యరాజు చెప్పా రు. వీరిద్దరు బైకుపై దొంగలను వెంబడించే ప్రయత్నం చేశారు. ఇద్దరు దొంగలు ఒడిశా రాష్ట్రం పాడువ వైపు పారిపోతుండగా.. బలియగూడ వద్ద వారి స్కూటీ అదుపు తప్పింది. సంఘటన స్థలంలోనే స్కూటీ, రెండు సెల్ ఫోన్లు వదిలి దొంగలు గాయాలతోనే కొండప్రాంతం వైపు పారిపోయారు. దొంగలు వదిలి వెళ్లిపోయిన ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కూటీ, రెండు సెల్ ఫోన్లు తీసుకొని, పెదబయలు ఎంపీడీవో పూర్ణయ్య సహాయంతో బాధితుడు మత్స్యరాజు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దొంగల స్కూటీని ఎస్‌ఐ పరిశీలించగా డిక్కీలో రూ.5 లక్షల నగదును గుర్తించారు. మిగిలిన రూ.10 లక్షల 6 వేల 200 సొమ్మును దొంగలు తీసుకొని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు పెదబయలు బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన రెక్కీకి సంబంధించిన సీసీ పుటేజీని వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యరాజు సేకరించి పోలీసులకు అందజేశారు. ఒడిశాలోని పాడువ పోలీసుల సహకారంతో ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సుమారు రూ.10 లక్షలు
పట్టుకుపోయిన దుండగులు
బ్యాంక్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్
నగదు తెస్తుండగా తుపాకులతో అడ్డగింత
రాయిపల్లి సమీపంలో ఘటన

కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము దోపిడీ