
పెళ్లయిన రెండు నెలలకే..
రాజవొమ్మంగి: అత్తవారింటికి కోటి ఆశలతో బయలుదేరాల్సిన నవ వధువు గుండె నొప్పితో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరినీ కన్నీరు పెట్టించిన ఈ హృదయ విదారక ఘటన గడుఓకుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఇదే గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన రమాదేవి (21)కు సుమారు రెండు నెలల క్రితం ప్రత్తిపాడు మండలం బాపన్నదొర గ్రామానికి చెందిన రాజుబాబుతో వివాహం అయ్యింది. ఆషాఢ మాసం ముగియడంతో ఆమెను తీసుకువెళ్లేందుకు అత్తింటి నుంచి భర్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంటిల్లి పాది రమాదేవిని అత్తవారింటికి పంపించే పనిలో సందడిగా ఉన్నారు. అప్పటివరకు ఇంట్లో అందరితో కలియ తిరిగిన రమాదేవి గుండెల్లో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణం నిలిపేందుకు ప్రయత్నించారు. ఫలితం కనిపించకపోవడంతో వెంటనే రమాదేవిని లాగరాయి పీహెచ్‌సీకి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. కార్డియాక్ అరెస్టు వల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. ఆమె ఆకస్మిక మృతితో ఇరువైపు కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టెడు దుఃఖంలో మునిగి పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నవ వధువు రమాదేవి హఠాన్మరణం
గుండెనొప్పితో కన్నుమూత
అత్తవారింటికి వెళ్లే ఏర్పాట్లలో
ఉండగా ఘటన
గడుఓకుర్తి గ్రామంలో విషాదం