
జగన్ ప్రజాదరణ చూసి కూటమిలో వణుకు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● నెల్లూరు పర్యటనలో సర్కార్ ఆంక్షలపై మండిపాటు
అరకులోయ టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ నెల్లూరు పర్యటనలో ప్రభుత్వ ఆంక్షలపై ఆయన మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతానికి జనం రాకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుపెడుతోందన్నారు. నెల్లూరు పర్యటన సమయంలో గ్రామాల చుట్టూ జేసీబీలతో గుంతలు తీయడం, కంచెలు వేయడం వంటి చేతకాని పనులు చేయడం సిగ్గు చేటన్నారు. వేలాది మందికి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. నెల్లూరు పర్యటన సమయంలో ప్రభుత్వ తీరు ఆక్షేపణేయంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, అవినీతిలో కూరుకుపోయి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు భవిష్యత్‌లో తప్పకుండా మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌కుమార్, అరకు బూత్ కమిటీ ఇన్‌చారిర్జ పాంగి విజయ్ కుమార్, యువ నాయకుడు బోయి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.