
తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలైవాస్ ఢీ
ఈ నెల 29 నుంచి ప్రో కబడ్డీ ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: ప్రో కబడ్డీ 12వ సీజన్ ఈ నెల 29న పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు జరిగే ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్‌తో తలపడనుంది. ఏడేళ్ల విరామం తర్వాత విశాఖ మరోసారి ప్రో కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత సీజన్‌లో తొలి విడత మ్యాచ్‌లు ఇక్కడే జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ తమ రెండో మ్యాచ్‌ను ఈ నెల 30న యూపీ యోధాస్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బెంగాల్ వారియర్స్‌తో, 10న యు ముంబాతో విశాఖ వేదికగానే తలపడనుంది. ప్రో కబడ్డీ ప్రారంభ సీజన్‌ను తెలుగు టైటాన్స్ విశాఖపట్నం నుంచే మొదలుపెట్టింది. ఆ తర్వాత తమ హోమ్ గ్రౌండ్‌ను హైదరాబాద్‌కు మార్చింది. మధ్యలో మూడో, ఎనిమిదో సీజన్‌లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడనున్నాయి. తొలి విడత పోటీలు విశాఖపట్నంలో జరగనుండగా, తదుపరి విడత పోటీలు జైపూర్, చైన్నె, ఢిల్లీల్లో నిర్వహించనున్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.