
ఏయూలో తికమక పాలన
● మూడు విభాగాలకు నూతన హెచ్‌వోడీలు ● జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు ● థియేటర్ ఆర్ట్స్ హెచ్‌వోడీగా ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ● ఇద్దరూ సంబంధం లేని విభాగాలకు అధిపతులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలన పక్కదారి పడుతోంది. సంబంధం లేని విభాగాలకు చెందిన ఆచార్యులను హెచ్‌వోడీలుగా నియమించడం చర్చనీయాంశమైంది. జర్నలిజంలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లను కాదని ఇతర విభాగానికి చెందిన ఆచార్యుడిని విభాగాధిపతిగా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏయూలో తీసుకుంటున్న తికమక నిర్ణయాలు కారణంగా పాలన గాడి తప్పుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఏయూలో మూడు విభాగాలకు హెచ్‌వోడీలను నియమించారు. ఇందులో హిందీకి అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ను హెచ్‌వోడీగా పెట్టారు. మిగిలిన రెండు విభాగాలకు సంబంధం లేని వారిని హెచ్‌వోడీగా నియమించారు. జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు పి.ప్రేమానందంకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జర్నలిజం విభాగానికి ముగ్గురు సీనియర్ ఫ్యాకల్టీలు ఉన్నారు. వీరిలో ఒకరిని హెచ్‌వోడీగా నియమించే అవకాశముంది. కానీ వీరిని పక్కనపెట్టి పొలిటికల్ సైన్స్‌కు చెందిన హెచ్‌వోడీని నియమించడం గమనార్హం. అలాగే థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా ఫైన్ ఆర్ట్స్ హెచ్‌వోడీ డి.సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిద్దరూ తమ సొంత విభాగాలకు హెచ్‌వోడీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక విభాగంలో విభాగాధిపతిగా పనిచేస్తున్న వారిని మరో విభాగానికి హెచ్‌వోడీగా నియమించడం కూడా వివాదాస్పదమవుతోంది. అతిథి అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హడావుడిగా ఈ నియామకాలు జరగడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది అనుచిత లబ్ధి చేయడానికా? లేదా అణిచివేయడానికా అని అతిథి అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ థియేటర్ ఆర్ట్స్, జర్నలిజానికి ఇన్‌చార్జ్ హెచ్‌వోడీగా వ్యవహరిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడంతో పాటు వివిధ విభాగాలకు హెచ్‌వోడీలుగా బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. వర్సిటీ అధికారుల నుంచి కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రిన్సిపాల్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో హెచ్‌వోడీల నియామకం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది.