
నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలి
● మజ్జివలస ఏకలవ్య పాఠశాల భూదాతల డిమాండ్ ● గిరిజన సంఘ నేతలతో కలిసి నిరసన
అరకులోయ టౌన్:మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి భూములిచ్చిన తమకు నష్టపరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని దాతలు డిమాండ్ చేశారు. గురువారం గిరిజన సంఘ నేతలతో కలిసి పాఠశాల గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడారు. 2018–19లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 16 మంది గిరిరైతులనుంచి సుమారు 18 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. భూములు సేకరించి ఆరేళ్లు గడుస్తున్నా ఎటువంటి పరహారం చెల్లించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా ఐటీడీఏ అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు మాయమాటలు చెప్పి అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా భూదాతలకు పరిహారం చెల్లించి, దాతలకు పాఠశాలలో ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఎస్ జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, ఉపాధ్యక్షుడు కె. రామారావు, పీసా కమిటీ కార్యదర్శి అప్పన్న, గిరిజనులు గొల్లోరి పరశురాం, కొర్రా నాగమణి, తదితరులు పాల్గొన్నారు.