
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
● చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశం ● ప్రజల నుంచి 57 వినతుల స్వీకరణ
ఎటపాక: గీవెన్స్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్‌లో ఆర్‌అండ్‌ఆర్ 5, భూతగాదా 28, ఇతర సమస్యలు 24 వినతులను స్వీకరించారు.
అధికారులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు
షెడ్యూల్ ఏరియాలో యథేచ్ఛగా భూబదలాయింపు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాక అర్జున్‌దొర పీవోకు ఫిర్యాదు చేశారు. 1970 తర్వాత కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరుల మధ్య భూబదలాయింపు చట్టవిరుద్ధమని తెలిపారు. గుండాల గ్రామ పంచాయతీలో అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఐవీ, గ్రామశాఖ కార్యదర్శి తోట శ్రీనివాసరావు వినతిపత్రం అందజేశారు.
అందని ద్రాక్షలా విద్య, వైద్యం..
మండల కేంద్రం ఎటపాకలో అభివృద్ధి లేదని ఇక్కడ విద్య,వైద్యం ఉపాధి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని, పలు సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం నాయకులు డేగల మాధవరావు అర్జీ అందజేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాలని, ఎటపాక ప్రదాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని శివ, నరేష్, శ్రీనివాస్ తదితరులు పీవోను కోరారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.