
హైడ్రోపవర్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్
గూడెంకొత్తవీధి: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులను రద్దుచేయాలని సీఐటీ యూ జిల్లా అద్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జీకేవీధిలో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో సర్వహక్కులు గిరిజనులకే చెందుతాయని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల జలవనరులు నాశనం కావడంతో పాటు ఎన్నో గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వాలు గిరిజన చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పవర్ ప్రాజెక్టుల అనుమతులు రద్దుకు గిరిజనులంతా ఏకతాటిపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, పార్టీ నాయకులు సత్యనారాయణ,కోటేశ్వరరావు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.