
అట్టహాసంగా ‘నవోదయ’ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ పోటీలకు స్థానిక నవోదయ విద్యాలయం వేదిక అయింది. వీటిని ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, జీఎంఆర్ పాల్‌టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామసత్యనారాయణ ప్రారంభించారు. మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడల ద్వారా విధ్యార్థులు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని అద్భుతాలు సాధించవచ్చన్నారు.రీజనల్ స్థాయి క్రీడలు ఎటపాకలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. నవోదయ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో జరిగిన క్లస్టర్ స్థాయి పోటీల్లో ఎటపాక విద్యార్థులు 40 మంది విజయకేతనం ఎగురువేశారన్నారు. ఈ పోటీల్లో కృష్ణా, వైఎస్సార్ కడప, ఖమ్మం, షిమోగా, తుంకూర్, పతనంతిట్ట, వయనాడ్ క్లస్టర్ల క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరచారి, లక్ష్మీప్రియ, గౌరీశంకర్, పీడీ జగన్, కోచ్ బాబు పాల్గొన్నారు.

అట్టహాసంగా ‘నవోదయ’ టేబుల్ టెన్నిస్ పోటీలు