
ఏవోబీలో ముమ్మరంగా తనిఖీలు
ముంచంగిపుట్టు: మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలతో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో సీఆర్‌ఫీఎఫ్ బలగాలు,స్పెషల్ పార్టీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.మారుమూల లక్ష్మీపురం,కుమడ,భూసిపుట్టు,రంగబయలు పంచాయతీల నుంచి వచ్చే వాహనదారులను ప్రశ్నించి వారి లగేజ్‌లు,బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానితుల వివరాలు సేకరించి విడిచిపెట్టారు.జోలాపుట్ట,దోడిపుట్టు నైట్‌హాల్ట్ బస్సులను మండల కేంద్రానికే పరిమితం చేశారు.ప్రభుత్వ కార్యలయాల వద్ద రాత్రిపూట పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాలైన జోలాపుట్టు,మాచ్‌ఖండ్,ఒనకఢిల్లీ,పాడువలలోని బీఎస్‌ఎఫ్ బలగాలు సైతం తనఖీలు చేస్తూ సరిహద్దు రాకపోకలపై ప్రత్యేక నిఘాను ఉంచాయి.ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్త వ్యక్తులు,అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగాతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.వారోత్సవాలతో ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: స్థానిక బస్టాండ్ ఆవరణలో సోమ వారం ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు నిర్వహించినట్టు ఎస్‌ఐ తెలిపారు. వారపు సంతకు వచ్చిపోయే అన్ని వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో రవాణా చేస్తున్న సామగ్రిని పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. కొత్త వ్యక్తులపై నిఘా విధించారు.