
తల్లికి వందనం సొమ్ము జమ చేయండి
● అర్హులైనా పథకం అమలుకాలేదని నిరుపేద కుటుంబం ఆవేదన ● ఉన్నతాధికారులు స్పందించాలని వినతి
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం అమలుచేసే అరకొర పథకాలు సైతం అందరికీ అందడం లేదు.నీకు రూ.1500, నీకు రూ.1500 అంటూ ప్రచారం చేసిన ఏడాది తరువాత అమలు చేసిన తల్లికి వందనం పథకం కొందరికే పరిమితమైంది. ఈ పథకం అందని వారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ముంచంగిపుట్టు మండలం మారుమూల రంగబయలు పంచాయతీ జర్రెలపోదర్ గ్రామానికి చెందిన వంతాల కళ్యాణం అనే నిరుపేద గిరిజనుడు గత నెల రోజులుగా తల్లికి వందనం కోసం తిరిగి సోమవారం ‘సాక్షి’ ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని, వీరిలో ముగ్గురు పిల్లలు చదువుతున్నారని, పెద్ద కుమార్తె వంతాల బుజ్జిమ్మ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రెండవ కుమార్తె వంతాల అనిత 7వ తరగతి, మూడో కుమారుడు వంతాల మహేంద్ర 4వ తరగతి చదువుతున్నారని, ముగ్గురికి తల్లికి వందనం పడుతుందని ఎంతో ఆశ పడ్డానని, ఒక్కరికి కూడా పడలేదని వాపోయాడు. సచివాలయానికి పలుమార్లు తిరిగిన నాకు న్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించి తల్లికి వందనం పథకం మంజూరయ్యేటట్టు చూడాలని, నీరుపేద గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు వంతాల కళ్యాణం, వంతాల సీతలు వాపోయారు.