దేవరాపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.60 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి జీవీఎంసీ తాగునీరు నిమిత్తం 50 క్యూసెక్కుల నీరు విడుదల కొనసాగుతుంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండడంతో నిండుకుండలా కళకళలాడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు నీటికి ఢోకా ఉండబోదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రైవాడ ఆయుకట్టు భూముల్లో ఖరీఫ్ వరి సాగుకు దమ్ములు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖరీఫ్‌కు ఈ నెల 29న కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.