
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య విధులు నిర్వహిస్
● నాలుగు నెలలుగా అందని వేతనాలు ● అర్థాకలితో అలమటిస్తున్న కార్మికులు ● నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న పంచాయతీలు ● రూ.1.80 కోట్ల వరకూ పెండింగ్ వేతనాలు
సాక్షి, పాడేరు: గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న క్లాప్ మిత్రల పరిస్థితి దయనీయంగా మారింది. గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా నెలకు రూ.6 వేల వేతనంతో పనిచేస్తున్నారు. అయినప్పటికీ వీరికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించడంలేదు. అరకొర వేతనాలు సైతం నెలల తరబడి అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంటోందని క్లాప్ మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన బకాయిల చెల్లింపు కోసం విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదని వాపోతున్నారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో 352 గ్రామ సచివాలయాలకు సంబంధించి పారిశుద్ధ్య పనులు,తడి,పొడి చెత్త సేకరణకు గాను ప్రభుత్వం క్లాప్ మిత్రల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 752 మంది క్లాప్ మిత్రలు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదు. ఈ బకాయిలు మొత్తం రూ.1.80 కోట్ల వరకూ ఉంటాయని చెబుతున్నారు. దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈవేతనంపైనే ఆధారపడుతున్న క్లాప్ మిత్ర కుటుంబాలు కూడా అర్థాకలితో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.గౌరవ వేతనాలను పంచాయతీల నుంచి పంపిణీ చేయనప్పటికీ క్లాప్ మిత్రలు మాత్రం ఆర్థిక ఇబ్బందులు పడుతునే పారిశుధ్య పనులకు ఎంతో శ్రమిస్తున్నారు.
పంచాయతీలకు నిధుల సమస్య
జిల్లాలోని అన్ని పంచాయతీలకు నిధులు సమస్య అధికంగా ఉంది.పంచాయతీలకు సాధారణ నిధులు లేకపోగా, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వేరే పథకాలకు మళ్లిస్తున్న పరిస్థితితో పంచాయతీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. మేజర్ పంచాయతీల పరిధిలో రెగ్యులర్ పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందుతుండగా,మిగిలిన పంచాయతీల్లో అంతే కష్టపడుతున్న క్లాప్ మిత్రలకు మాత్రం గౌరవ వేతనాలు పంపిణీ కావడం లేదు.క్లాప్ మిత్ర కార్మికులకు కూడా సకాలంలో గౌరవ వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణమని గిరిజన ప్రజా,కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
క్లాప్ మిత్రలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. రోజూ ఎంతో శ్రమిస్తున్న కార్మికులకు ప్రతినెలా గౌరవ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం.వారంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి.
–ఉమామహేశ్వరరావు, సీఐటీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి, అరకులోయ
పాడేరుకు సమీపంలోని తలారిసింగి హాస్టల్ ప్రాంతంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న క్లాప్ మిత్రలు