
రసవత్తరంగా తైక్వాండో పోటీలు
యలమంచిలి రూరల్: పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 5వ జిల్లా స్థాయి తైక్వాండో సబ్ జూనియర్, మినీ సబ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో 12, బాలికల విభాగంలో 12 కేటగిరీల్లో నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. పోటీల్లో స్పారింగ్, ఇండివిడ్యువల్ ప్యాటర్స్, పవర్ బ్రేకింగ్, సెల్ఫ్ డిఫెన్స్, స్పెషల్ టెక్నిక్స్ వంటి రకరకాల ఈవెంట్లలో క్రీడాకారుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఓ క్రీడలా కాకుండా పిల్లల్లో క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ పోటీలను పెద్ద ఎత్తున క్రీడాకారుల తల్లిదండ్రులు, స్థానిక క్రీడాకారులు వీక్షించారు. ఇలాంటి పోటీలు తైక్వాండో క్రీడ ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఉపయోగపడతాయని అనకాపల్లి యూత్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.హేమంత్‌కుమార్, డి. యశ్వంత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చూపి సత్తా చాటారు. పోటీల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు త్వరలో గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారన్నారు. అంతకుముందు ఈ పోటీలను విశ్రాంత అధ్యాపకుడు ఆడారి పూరీ జగన్నాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తైక్వాండో పోటీల వల్ల పిల్లల్లో ఆత్మరక్షణ, ఆత్మస్థయిర్యం లాంటి మానసిక ధృడత్వం పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు. తైక్వాండో కేవలం మార్షల్ క్రీడే కాకుండా ఒలింపిక్ పోటీల్లో చోటు దక్కించుకుందన్నారు.
37 మందికి బంగారు పతకాలు
ఇండోర్ స్టేడియంలో జరిగిన తైక్వాండో పోటీల్లో 37 మంది బంగారు, 32 మంది రజతం, మరో 20 మంది కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు అతిథులు అభినందనలు తెలిపారు. జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కొండబాబు, కోచ్‌లు ఆలీ, మితిలేష్, మణి, మోహన్, గణేష్, భాస్కర్ పోటీలను పర్యవేక్షించారు.

రసవత్తరంగా తైక్వాండో పోటీలు