
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు వద్దు
అనకాపల్లి: ప్రభుత్వ ఉపాధ్యాయులను పి–4, కర్మయోగి యాప్‌ల నుంచి తొలగించి, విద్యార్థులకు బోధన వరకే పరిమితం చేయాలని బోధనేతర పనులను అప్పగించడం వల్ల విద్యా ప్రమాణాలు కుంటుపడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా ముఖ్య నేతల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విధులు నిర్వహించే గ్రామాల్లో కుటుంబాలను కేటాయించి, దత్తత తీసుకోమని చెప్పడం, బోధనేతర పనుల కిందికే వస్తుందన్నారు. పి–4 విధానంలో ఉపాధ్యాయులకు రెండేసి కుటుంబాలను, ప్రధానోపాధ్యాయులకు ఐదు కుటుంబాలను కేటాయించి దత్తత తీసుకోమని చెప్పడం వల్ల పనిభారం పెరిగి బోధనపై దృష్టి పెట్టలేరని అన్నారు. కర్మయోగి యాప్ ను ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దుతున్నారని, యాప్‌లో ఆన్‌లైన్ కోర్స్‌లో 56 వీడియోలు ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి చేయాలని బలవంతం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జూన్ 12 నుంచి విద్యార్థులకు సరైన బోధన చేయకుండా నిర్బంధంగా ఉపాధ్యాయులతో యాప్‌ల నిర్వహణ చేస్తున్న విద్యాశాఖ అధికారులు తమ వైఖరిని విడనాడాలన్నారు. రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ జీతంమీద ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులకు 2 మాసాల నుంచి జీతాలు రాకుడా చేసిన విద్యాశాఖాధికారులు వైఖరిని మార్చుకోవాలని అన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, గొంది చిన్నబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, కార్యదర్శులు పొలిమేర చంద్రరావు, రమేష్ రావు, శేషుబాబు పాల్గొన్నారు.