
పేరుకే పంచాయతీలు
● ఏర్పడి ఆరేళ్లయినా నోచుకోని భవనాలు ● పరిపాలన సాగేదెలా అంటున్న మూడు గ్రామాల సర్పంచ్‌లు
చింతూరు: ఆ మూడు.. పేరుకే పంచాయతీలుగా మారాయి. ఇవి ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనా సౌలభ్యం కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని రామన్నపాలెం, గంగన్నమెట్ట, లచ్చిగూడెం పంచాయతీల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే సర్పంచ్‌లుగా ఉంటున్నామని, నిధులు మంజూరు కానందున పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక పోతున్నామని వారు వాపోతున్నారు. సమస్యలు పరిష్కారం కానందున ప్రజలు తమను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● మండలంలో గతంలో 15 గ్రామ పంచాయతీలు ఉండేవి. ఐదొందలు జనాభా కలిగి వందశాతం గిరిజనులు నివసిస్తున్న చిన్న గ్రామాలను కలిపి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో మండలంలో మరో మూడు పంచాయతీలు ఏర్పడడంతో వీటి సంఖ్య 18కు చేరింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2019లో మండలంలోని తుమ్మల పంచాయతీలోని లచ్చిగూడెం, గంగన్నమెట్ట, పెదశీతనపల్లి పంచాయతీలోని రామన్నపాలెం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గంగన్నమెట్టలో 307, వేకవారిగూడెంలో 214 మంది జనాభాతో గంగన్నమెట్ట పంచాయతీగా, లచ్చిగూడెంలో 180, వెంకట్రామాపురంలో 98, కొత్తూరులో 225 మంది జనాభాతో లచ్చిగూడెం, రామన్నపాలెంలో 400, చినశీతనపల్లిలో 152 మంది జనాభాతో రామన్నపాలెం పంచాయతీ ఏర్పడ్డాయి.
పాలన సాగేదెలా?
గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో గ్రామసభలు, పాలకవర్గ, పీసా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రచ్చబండ లేదా చెట్లకింద సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులు భద్రపరచుకునేందుకు కార్యదర్శులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కూడా లేకపోవడంతో కార్యదర్శి ఒక్కరే అన్ని విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతోపాటు పంచాయతీ భవనం లేకపోవడం, కార్యదర్శి ఎప్పుడు వస్తారో తెలియక ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలుగా ఏర్పడినా చిన్న పంచాయతీలుగానే గుర్తింపు పడడంతో నిధులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని, అవికూడా సక్రమంగా రావడం లేదని సర్పంచ్‌లు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టలేక పోతున్నామని, ఈ విషయాన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరుకే పంచాయతీలు