
‘సృష్టి’ రహస్యాలెన్నో...!
● ఐవీఎఫ్‌లో కలకలం ● పిల్లలు లేని దంపతులే లక్ష్యం ● భారీగా వసూళ్ల పర్వం ● లోపించిన వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ ● వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఐవీఎఫ్ సెంటర్లు
మహారాణిపేట: పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, సరోగసీ (అద్దె గర్భం), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కేంద్రాలు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. మాతృత్వపు ఆనందాన్ని అందిస్తున్న ఈ పద్ధతులను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకునే మార్గంగా చూస్తూ మహిళల నుంచి అడ్డగోలుగా డబ్బు దోచుకుంటున్నాయి. గతంలో ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టానుసారం సరోగసీని ఉపయోగించుకుని డబ్బులు దండుకున్నాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలోని ‘సృష్టి ఐవీఎఫ్’ సెంటర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ, ఐవీఎఫ్ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించి నియంత్రిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొంది మాత్రమే ఈ కేంద్రాలను నడపాలి. జిల్లాలో 41 ఐవీఎఫ్, 9 సరోగసీ కేంద్రాలు సహా మొత్తం 50 కేంద్రాలు పనిచేస్తున్నట్లు సమాచారం.
టెస్ట్ ట్యూబ్ బేబీ
సహజ పద్ధతిలో గర్భధారణ కానివారికి లేదా పురుషులలో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు ఐవీఎఫ్ పద్ధతిని సూచిస్తారు. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల్లో ఏఆర్‌టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంక్, ఎల్–1, ఎల్–2 విభాగాలు ఉంటాయి. వీటి కోసం వరుసగా రూ. 50వేలు, రూ.50వేలు, రూ. 2 లక్షలు డిపాజిట్/డీడీ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు సదుపాయాలు, వైద్యుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించాలి.
కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు
కలెక్టర్ అధ్యక్షతన సరోగసీ, ఐవీఎఫ్ పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్, సెషన్స్ జడ్జి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖ గైనకాలజిస్టులు సభ్యులుగా ఉంటారు. సరోగసీకి కలెక్టర్, ఐవీఎఫ్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
‘సృష్టి’ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన
జిల్లా పరిషత్ సమీపంలోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ కేంద్రం 2018 నుంచి 2023 వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అనధికారికంగా నడుస్తోంది. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో కేసులు నమోదయ్యాయి. మేనేజర్ కల్యాణికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ నుంచి తీసుకొచ్చి విశాఖలో డెలివరీ
గత నెలలో ఈ కేంద్రంలో డెలివరీ అయిన మగబిడ్డ విషయంలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకువచ్చి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను నమ్మించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలో కోట్లాది రూపాయల దందా చేసి, ఒక బిడ్డను రూ.30 లక్షలకు విక్రయించారని పోలీసులు చెబుతున్నారు.
అక్రమ వసూళ్లు, పర్యవేక్షణ లోపం
నగరంలో ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి యథేచ్ఛగా నడుపుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక కేసు నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కువగా ఉన్నవారి నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు పిల్లలు లేని తల్లుల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి బిల్లులు, లెక్కలు ఉండటం లేదు. ఈ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడుతోందని స్పష్టమవుతోంది.
నమోదు తప్పనిసరి
సరోగసీ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సేవలందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే నమోదు కోసం నిర్దేశించిన రుసుములను సకాలంలో చెల్లించాలి. రుసుము చెల్లింపులో జాప్యం చేసే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అనుమతులు పొందిన తర్వాత మాత్రమే సరోగసీ, ఐవీఎఫ్ ప్రక్రియలను ప్రారంభించాలి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోని ఏఆర్‌టీ సెంటర్లను కూడా సీజ్ చేస్తాం. అటువంటి సెంటర్లకు నోటీసులు జారీ చేసి, వారి సేవలను నిలుపుదల చేసి, ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 కింద కఠిన చర్యలు తీసుకుంటాం
–డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీఎంహెచ్‌వో

‘సృష్టి’ రహస్యాలెన్నో...!