
గిరిజన సంక్షేమ శాఖకు పెద్ద దిక్కు కరువు
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన సంక్షేమ శాఖకు పెద్ద దిక్కు కరువైంది. ఇక్కడ ప్రాజెక్టు అధికారి తర్వాత అంతటి విలువ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ (టీడబ్ల్యూ డీడీ) పోస్టుకు ఉంది. ఇంతటి ప్రాముఖ్యమైన గిరిజన సంక్షేమ ఉప సంచాలకుల పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలుగా ఎవరినీ నియమించకుండా గిరిజన సంక్షేమంపై వివక్ష చూపుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఆగస్టు నెలలో నెలలో ఇక్కడ పని చేసిన టీడబ్ల్యూ డీడీ కొండలరావును పలు అవినీతి, ఇతర ఆరోపణల నేపథ్యంలో సరెండర్ చేశారు. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎవరినీ నియమించలేదు. ఎనిమిదేళ్లుగా పాడేరు ఏటీడబ్ల్యూవోగా పని చేస్తున్న రజనీకు ఇన్‌చార్జి డీడీ బాధ్యతలు అప్పగించారు. ఆమైపె తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో సాధారణ బదిలీల్లో ఆమెను మన్యం పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవోగా బదిలీ చేశారు. ఏటీడబ్ల్యూవోగా విధుల నుంచి రిలీవ్ అయినప్పటికీ ఆమెను ఇన్‌చార్జి డీడీగా మాత్రం కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తన శాఖలో పని చేస్తున్న కిందిస్థాయి ఉద్యోగి చేత కాఫీ, మిరియాల వ్యాపారం భారీ స్థాయిలో చేసినట్లు పైగా రైతులకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ము ఎగనామం పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె ఈనెల 19న ఇన్‌చార్జి డీడీ పోస్టు నుంచి రిలీవ్ కాక తప్పలేదు. ఆమె స్థానంలో రెగ్యులర్ డీడీని కానీ కనీసం ఇన్‌చార్జి డీడీని కానీ ఇంకా ఎవరినీ నియమించలేదు.
ఎంతో ప్రాధాన్యమున్నా..
టీడబ్ల్యూ డీడీ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. వీటిలో 117 వసతి గృహాలు, 32 పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలు, గిరిజన గురుకుల కళాశాలలు, 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాల పర్యవేక్షణ బాధ్యత కూడా డీడీదే. ఏటా గిరిజన ఉపకార వేతనాలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల నిర్వాహణ బిల్లులు, సీఆర్టీల వేతనాలు, వసతి గృహాల్లో డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్ల వేతనాలు, డీడీ కార్యాలయ సిబ్బంది వేతనాలు, తదితర వాటికి ఏటా రూ.కోట్లలో చెల్లింపులు గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు ద్వారానే జరగాలి. ఇంతటి ప్రాముఖ్యమున్నా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుల పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏలో ఎవరినీ నియమించలేదు.
రెండు నెలలుగా నోచుకోని వేతనాలు
రెండు నెలలుగా సీఆర్టీసీలు, వసతి గృహా వర్కర్లు, డీడీ కార్యాలయ సిబ్బంది వేతనాలకు నోచుకోలేదు. డీడీ గానీ ఇన్‌చార్జి డీడీ గానీ థంబ్ వేస్తేనే సీఆర్టీలు, వసతి గృహ వర్కర్లు, డీడీ కార్యాలయ సిబ్బందికి వేతనాలు, వసతి గృహాల నిర్వాహణ బిల్లులు విడుదల అవుతాయి. జిల్లాలో 286 మంది సీఆర్టీలకు, 260 మంది డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వసతి గృహ వర్కర్లు, సుమారు 10 మంది డీడీ కార్యాలయ సిబ్బందికి ప్రస్తుతం రెండు నెలల వేతనాల బకాయి ఉంది. ప్రతి నెలా డీడీ థంబ్ వేస్తేనే కానీ 556 మందికి వేతనాలు పడవు. రెండు నెలలుగా వేతనాల బిల్లులు సిద్ధం కాలేదు. ఈలోగా ఇన్‌చార్జి డీడీ కూడా రిలీవ్ అయిపోయారు. కొత్త డీడీని నియమించకపోవడంతో ఇంత మంది వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి. పాడేరు ఐటీడీఏ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, డీఎస్‌వో, ఏబీవీబీ వంటి విద్యార్థి సంఘాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు, దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తదితర సంఘాలు ఆరోపిస్తున్నాయి.
భర్తీకాని డిప్యూటీ డైరెక్టర్ పోస్టు
కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శలు
ఈనెల 19న రిలీవ్ అయినప్పటికీ మరొకరికి బాధ్యతలు అప్పగించని వైనం
డీడీ థంబ్‌తో ముడిపడి ఉన్న కార్యాలయ సిబ్బంది వేతనాలు
సీఆర్టీలు, వసతి గృహాల డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్ల జీతాలపై ప్రభావం
రెండు నెలలుగా కొనసాగుతున్న ఇబ్బందులు