
శాంతి భద్రతల పరిరక్షణలో సీఆర్‌పీఎఫ్ కీలకపాత్ర
ముంచంగిపుట్టు: దేశీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సీఆర్‌ఫీఎఫ్ జీ198 బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఎంబీ శంకరరావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సీఆర్‌ఫీఎఫ్ 87వ రైజింగ్ డేను ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్, సామాజిక ఆరోగ్య కేంద్రం ,ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో మెగా ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ శంకరరావు మాట్లాడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి సీఆర్‌ఫీఎఫ్ బలగాలు నిత్యం ధైర్యం, నిబద్ధతలతో పనిచేస్తున్నాయన్నారు. దళంలో వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా దేశరక్షణకు తమ శక్తిమేర కృషి చేస్తాయని అన్నారు. విద్యార్థి స్థాయి నుంచి దేశం కోసం ఆలోచన చేయాలని, మంచి పేరు తెచ్చే పౌరులుగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కా ర్యక్రమంలో ఎస్‌ఐ జే.రామకృష్ణ, సీఆర్‌ఫీఎఫ్ ఎస్‌ఐ ఎన్.కృష్ణారావు, సీహెచ్‌సీ వైద్యాధికారి గీతాంజలి, వివేక్, ధరణి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సీఆర్‌ఫీఎఫ్ బలగాలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కమాండింగ్ ఆఫీసర్ ఎంబీ శంకరరావు

శాంతి భద్రతల పరిరక్షణలో సీఆర్‌పీఎఫ్ కీలకపాత్ర