ఆశ్రమాల్లో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమాల్లో అవస్థలు

Jul 27 2025 6:44 AM | Updated on Jul 27 2025 6:44 AM

ఆశ్రమ

ఆశ్రమాల్లో అవస్థలు

జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంతవరకు గిరిజన వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారానికి నిధులు మంజూరు చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండవ విడత నాడు–నేడులో మంజూరు చేసిన 967 విద్యాలయాల్లో పనులను కూడా నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా నిలిచిపోవడంతో గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కరువయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు, సోలార్‌ వాటర్‌ గీజర్‌ ప్లాంట్లు నిర్వహణలోపం వల్ల చాలాచోట్ల పనిచేయడం లేదు. బెడ్స్‌లేక నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సాక్షి పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం
● కనీస వసతులు లేక ఇబ్బందులు ● బెడ్స్‌ లేక నేలపైనే పడక ● రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేక నిరుపయోగంగా మరుగుదొడ్లు ● పనిచేయని ఆర్వో ప్లాంట్లు, గీజర్లు ● గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో నరకం చూస్తున్న విద్యార్థులు

రన్నింగ్‌ వాటర్‌ లేక అవస్థలు

జి.మాడుగుల మండలం గెమ్మెలి గిరిజన

సంక్షేమ ఆశమ్ర పాఠశాలలో రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేక కుళాయిలు నిరుపయోగంగా మారాయి. సుమారు మంది విద్యార్థులు ఉన్న ఈ వసతి గృహంలో కుళాయిలు పనిచేయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్లుగా ఇదే దుస్థితి నెలకొంది.

నేలపైనే పడక

మండల కేంద్రమైన డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు లేవు. ఇక్కడ 315 మంది ఆశ్రయం పొందుతున్నారు. బంకర్‌ బెడ్స్‌ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. దీనివల్ల సుమారు 200 మంది విద్యార్థులు కటిక నేలపై పడుకోవాల్సి వస్తోంది.

వేచి ఉండాల్సిందే..

కూనవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమశాఖ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహంలో 270 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు లేవు. భోజన అనంతరం చేతులు కడుక్కునేందుకు తగిన సౌకర్యం లేక వేచి ఉండాల్సి వస్తోంది.

పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలో అధ్వాన పరిస్థితులకు తలార్‌సింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలుర వసతి గృహం అద్దం పడుతోంది. సుమారు 432 మంది ఉన్న ఈ వసతి గృహంలో దృశ్యాలను చూస్తే చలించకమానదు. దశాబ్దాల క్రితం నిర్మించిన వసతి గృహ భవనాలు పూర్తిగా శిథిలస్థితికి చేరాయి. గచ్చులు పూర్తిగా ఊడిపోయాయి. భవనం శ్లాబ్‌ పెచ్చులూడి పడుతోంది. ఏ గదికి కిటికీలు, తలుపులు లేవు. చలికాలంలో అవస్థలు వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో విద్యుత్‌ సౌకర్యం లేదు. విద్యార్థులే కొంత సొమ్ము పోగుచేసుకుని విద్యుత్‌ సమస్య పరిష్కారానికి వెచ్చించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు లేవు. ఉన్నవాటికి రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేదు. దీంతో విద్యార్థుల పాట్లు అన్నీఇన్నీ కావు. కలెక్టరేట్‌, ఐటీడీఏ, ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు పక్కనే ఉన్న విద్యార్థుల సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జి.మాడుగుల : మండలంలో పది ఆశ్రమ వసతి గృహాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గిరిజన గురుకులం, మినీ గురుకులం, ఏకలవ్య, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,500 మంది విద్యార్ధులు చదువుతున్నారు. జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వసతి గృహంలో గదులకు కిటికీలు, తలుపులు లేవు. విద్యుత్‌ సమస్య ఎక్కువగా ఉంది. జీఎం కొత్తూరు, గాంధీనగరం వసతి గృహాల్లో మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం లేక బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు బకెట్లతో నీటిని మోసుకుని తేవాల్సి వస్తోంది. కొక్కిరాపల్లి వసతి గృహంలో బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు లేవు.

● చింతపల్లి మండలంలో పది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ఐదు పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాలు, ఒక కేజీబీవీ, ఒక మినీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సుమారు 5,500 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహం మినహా మిగిలిన అన్ని వసతి గృహాలకు ప్రహరీలు లేవు. దీంతో బాలికలకు రక్షణ కరువైంది.

● లంబసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు వసతి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 250 మంది బాలికలు చదువుతుండగా పది గదులు మాత్రమే ఉన్నాయి. జాజులపాలెం బాలుర వసతి గృహంలో సోలార్‌ వాటర్‌ గీజర్లు పని చేయడం లేదు.

సమస్యల తిష్ట

రంపచోడవరం: ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ఈ పాఠశాలలో 326 మంది గిరిజన విద్యార్ధులు చదువుతున్నారు. హాస్టల్‌ సదుపాయం సక్రమంగా లేకపోవడంతో తరగతి గది, వసతి ఒకే చోట ఉండడంతో విద్యార్థులు సర్దుకుపోతున్నారు. డైనింగ్‌ హాలు సదుపాయం లేకపోవడంతో వర్షం పడినప్పుడు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తడుస్తూనే కంచాలు పట్టుకుని లైన్‌లో నిల్చోవాల్సి వస్తోంది. వంటశాల, మరుగుదొడ్ల నుంచి మురుగునీరు వెళ్లేందుకు డ్రైనేజీ సదుపాయం లేదు. దీనివల్ల పాఠశాల గోడ పక్కనే ఉన్న మురుగు కాలువ నుంచి దుర్గంధం వస్తోంది. నాడు–నేడు ఫేజ్‌2లో నిధులు కేటాయించకపోవడంతో అసంపూర్తిగా భవనం నిలిచిపోయింది. విద్యార్ధులు కార్పెట్లు సరఫరా చేయకపోవడంతో దుప్పట్లు వేసుకుని పడుకుంటున్నారు.

● గంగవరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వసతి కరువైంది. నిధుల కొరత వల్ల భవన నిర్మాణం నిలిచిపోయింది. విద్యార్థులు ఉన్న పడకలను సర్దుకోవాల్సి వస్తోంది.

● వీఆర్‌ పురం మండలం రేఖపల్లిలోకి కస్తూర్బా విద్యాలయంలో 251 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరికి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో వసతి సౌకర్యం లేదు. పాఠశాలలో ఏఎన్‌ఎం సదుపాయం లేదు. నైట్‌ వాచ్‌మెన్‌ లేడు. కిటికీ దోమ తెరలు లేవు. నాడు–నేడులో చేపట్టిన భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది.

● రేఖపల్లిలోని మినీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్టుగా వసతులు లేవు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 195 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదిలోనే వీరు నిద్రిస్తున్నారు. దుప్పట్లు వేసుకుని గచ్చుపై పడుకుంటున్నారు.

● రాజవొమ్మంగిలోని బీసీ వసతి గృహంలో 62 మంది విద్యార్ధులు ఉన్నారు. మరుగుదొడ్లు లేవు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన స్పందన లేదని వారు వాపోతున్నారు. హాస్టల్‌ గదులకు కిటికీలు లేకపోవడంతో చల్లగాలి, దోమలతో ఇబ్బంది పడుతున్నారు.

● కూనవరం మండలం కోతులగుట్లలోని ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ బాలికల పాఠశాలలో 720 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ పాఠశాలలో 52 మరుగుదొడ్లు ఉండగా అందులో 16 మరుగుదొడ్లు మరమ్మతులకు గురయ్యాయి. పాఠశాల ఆవరణలో ఐదు బోర్లు ఉండగా రెండు బోర్లు పనిచేయడం లేదు. విద్యార్ధులు భోజనం చేసిన తరువాత చేతులు కడుక్కొనేందుకు వాష్‌ రూమ్‌ ఒక్కటే ఉంది.

● ఎటపాక మండలం గౌరీదేవిపేట బీసీ బాలుర వసతి గృహంలో వంటిషెడ్డు లేకపోవడంతో లేపోవడంతో హాస్టల్‌ గదిలోనే వంటలు చేస్తున్నారు.

అరకులోయ టౌన్‌: అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో విద్యార్ధులు సతమతమవుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న వసతి గృహాల్లో మినహా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాల్లో ముఖ్యంగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. విద్యార్థులు పడుకునేందుకు బంకర్‌ బెడ్స్‌ కొన్ని వసతి గృహాల్లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల నేలపైనే పడుకుంటున్నారు. కనీసం జంబుఖానా కూడ సరఫరా చేయకపోవడంతో చలికాలం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సరైన సౌకర్యాలు లేకపోవడం, కలుషిత నీటిని సేవించడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. మూరు మూల ప్రాంతంలోని వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టడంలేదని చెబుతున్నారు.

● హుకుంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో భవనాలు, వసతి గృహాలు మరమ్మతుకు గురయ్యాయి. మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బంకర్‌ బెడ్స్‌ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లవిద్యార్థులు నేలపై పడుకుంటున్నారు.

● ముంచంగిపుట్టు జెడ్పీ పాఠశాల వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 120 మంది విద్యార్థులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నాడు–నేడు పథకంలో నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.

● డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో రన్నింగ్‌ వాటర్‌ సక్రమంగా లేనందున మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డే స్కాలర్‌ విద్యార్థులకు వంట చేసేందుకు ఏర్పాటుచేసిన షెడ్డు నిరుపయోగంగా ఉంది. తలుపులు ఏర్పాటుచేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.

ఐటీడీఏల వారీగా వివరాలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యం

సాక్షి, పాడేరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. నాడు–నేడు పథకంలో మొదట విడతగా జిల్లాలో 581 గిరిజన విద్యాలయాలను రూ.16527.07లక్షలతో అభివృద్ధి చేసింది. పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. రెండవ విడతలో 2023–24కు సంబంధించి 967 గిరిజన విద్యాలయాల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.21814.35 నిధులు మంజూరు చేసింది. ఆయా పాఠశాలల్లో పనులన్నీ చివరిదశకు చేరుకునే సమయంలో ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వీటి ఊసెత్తడం లేదు.

ఆశ్రమాల్లో అవస్థలు1
1/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు2
2/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు3
3/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు4
4/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు5
5/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు6
6/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు7
7/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు8
8/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు9
9/10

ఆశ్రమాల్లో అవస్థలు

ఆశ్రమాల్లో అవస్థలు10
10/10

ఆశ్రమాల్లో అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement