
వైభవంగా శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభం
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం పురస్కరించుకుని శ్రావణలక్ష్మి పూజలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలను ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి, అనంతరం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. వేదమంత్రాల మధ్య, నాదస్వర సుస్వరాలతో ఉదయం 8:20 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలో ఉభయదాతలు రెండు బ్యాచ్‌లుగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పూజలో స్వయంగా పాల్గొన్న భక్తులకు ప్రసాదం అందజేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. శోభారాణి తెలిపిన వివరాల ప్రకారం, శ్రావణ మాసం సందర్భంగా నెలరోజులు జరిగే పూజలకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొనదలచిన భక్తులు రూ.400 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పూజ అనంతరం ఉభయదాతలకు శోభావస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, రాగి స్టాండు యంత్రం, పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదం అందజేస్తామన్నారు. ప్రతి గురువారం, శుక్రవారాల్లో రెండు బ్యాచ్‌లుగా, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పూజలు జరుగుతాయన్నారు.
ముత్యాల చీరలో కన్యకాపరమేశ్వరి
డాబాగార్డెన్స్: కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు ముత్యాల చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 5 గంటలకు అమ్మవారి మూలవిరాట్‌కు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలు, అలాగే 108 ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ముత్యాల చీరతో అలంకరించి, 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక నివేదన సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆ తర్వాత ఆస్థాన పురోహితులు ఆర్‌బీబీ కుమారశర్మ నేతృత్వంలో 250 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ సంఘ అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు, శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన
సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజను వైభవంగా నిర్వహించారు. సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదంగా అందజేశారు. అలాగే, సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడా మండపంలో తిరువీధి సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ చేపట్టారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు, పారాయణదారులు ఈ పూజలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వైభవంగా శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభం

వైభవంగా శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభం