
విస్తారంగా వర్షాలు
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● స్తంభించిన జన జీవనం
సాక్షి,పాడేరు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.గురువారం ఉదయం నుంచి పాడేరు,పెదబయలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని గుత్తులపుట్టు వారపుసంతల్లో వ్యాపారులు, గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. గ్రామాలకు నిత్యావసరాలు తరలించేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. సాగు భూముల్లో వర్షం నీరు చేరడంతో చెరువులను తలపించాయి. గిరి రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సీలేరు పరిసర ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సీలేరు, ధారకొండ ధారాలమ్మ తల్లి ఘాట్‌రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఘాట్‌రోడ్డు గోతులమయంగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, గెడ్డలు దాటేందుకు సాహసించవద్దని ఎస్‌ఐ రవీంద్ర సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తమకు తెలియజేయాలని ఆయన కోరారు.
ముంచంగిపుట్టులో ముసురు వాతావరణం.
ముంచంగిపుట్టు: మండలంలో ముసురు వాతావరణం నెలకొంది.గురువారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.ముంచంగిపుట్టు, పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ రహదారులు చిత్తడిగా మారాయి. వర్షపు నీటికి కొన్నిచోట్ల రోడ్లపై మట్టి నిలిచిపోయింది. వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. మారుమూల రంగబయలు, లక్ష్మీపురం, బుంగాపుట్టు, భూసిపుట్టు పంచాయితీల్లో వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి. మత్స్యగెడ్డలో వరదనీరు భారీగా చేరింది.
జి.మాడుగుల: మండలంలో గురువారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బొయితిలి పంచాయతీ మద్దిగరువు వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. పెదబయలు తదితర మండలాల నుంచి అమ్మకానికి పంట ఉత్పత్తులు తెచ్చిన గిరి రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పలు చోట్ల బురదమయంగా మారింది.
మూడు రోజులు భారీ వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విబాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈ మూడు రోజులపాటు ఒక మోస్తరు నుంచి బారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గరిష్ట ఉపరితల గాలి గంటకు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వీస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో భారీ ఉరుములు, మెరుపుల ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి, అరటి, కూరగాయ పంటలు సాగు చేసే పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు పోయేలా మార్గం ఏర్పాటుచేసుకోవాలని ఆయన సూచించారు.

విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు