
వయోవృద్ధులకు అక్షరజ్ఞానం అవసరం
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ
పాడేరు: జిల్లాలో వయోజన విద్యాకార్యక్రమంలో శిక్షణ పొందే వారికి కనీస అక్షరజ్ఞానం ఉండాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ సూచించారు. గురువారం ఐటీడీఏలోని తన అధ్యక్షతన చాంబర్‌లో నిర్వహించిన ఉల్లాస్ అక్షర ఆంధ్రా కార్యక్రమ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు.చదవడం, రాయడం, పుస్తకాల నిర్వహణ, ఫోన్‌లో వచ్చే సమాచారం అర్థం చేసుకోవడం వంటి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు. అక్షర ఆంధ్రా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఉల్లాస్ రెండో దశలో 85,284 మంది నిరక్షరాస్యులను చేర్చడం జరుగుతుందన్నారు. జిల్లా, మండల స్థాయి శిక్షణ తరగతులు వచ్చేనెల 8 వరకు కొనసాగుతాయని, అనంతరం బోధన ప్రారంభం అవుతుందన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులను ముందుగా చేర్చుకోవాలని సూచించారు. బోధనకు వలంటీర్లు వీరిలో చదువుకున్న వారిని వినియోగించాలని ఆదేశించారు. ఒకరు పది మందికి చదువు చెప్పేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మండల స్థాయిలో విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ శాఖలు నిత్యం పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తరగతులు జరుగుతాయ న్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా ఉప సంచాలకులు ఎస్.ఎస్. వర్మ, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, డ్వామా పీడీ విద్యా సాగర్, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయ్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, వయోజన విద్యా నోడల్ అధికారి గంగన్నదొర, డీపీఆర్వో బాల మాన్ సింగ్ పాల్గొన్నారు.