
పోస్టుమార్టం చేయడంలో జాప్యం
వైద్యుల తీరుతో ఇబ్బందులు పడ్డామని మృతుడి కుమార్తెల ఆవేదన
రంపచోడవరం: పోస్టుమార్టం చేయడంలో వైద్యులు జాప్యం చేయడం వల్ల ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆరోపించారు. వివరాలిలా ఉన్నాయి. వై.రామవరం మండలం ఎర్రంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాంబాబు (48)కు ఫిట్స్ రావడంతో అతని కుమార్తెలు ముగ్గురు అతనిని బుధవారం రాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. తమ తండ్రి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ, ఆస్పత్రి అంబులెన్సు డ్రైవర్ నిరాకరించాడని కుమార్తెలు శాంతికుమారి, దుర్గాభవాని, బాపన్నమ్మ ఆరోపించారు. దీంతో మృతదేహానికి వైద్యులు త్వరగా పోస్టుమార్టం పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శేషిరెడ్డిని వివరణ కోరగా పోలీసులు నివేదిక ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. వచ్చిన వెంటనే పోస్టుమార్టం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.