
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీపీవో చంద్రశేఖర్ హెచ్చరిక
చింతపల్లి: క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీవో కేపీ చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల పరిధి పెదబరడ, లోతుగెడ్డ జంక్షన్, రింతాడ వంచులు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా డీపీవో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు సంబంధిత డీఎల్పీవో, ఎంపీడీవో, కార్యదర్శులు, మహిళా పోలీసు, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం,ఆశ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పారిశధ్య పనులను పరిశీలించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా అవగాహన కల్పించి, సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పంచాయతీల పరిధిలో ఉన్నట్టువంటి బావులు, మంచినీటి ట్యాంకుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రధాన రహదారులలో వ్యాపారాలు చేసే వర్తకులు వాడిన చెత్తను బుట్టలలో కాకుండా రోడ్లపై వేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిదంగా గ్రామ పంచాయతీల్లో పగటి పూట వీధి దీపాలు వెలిగితే కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు. ఎంపీడీవో సీతామహలక్ష్మి, కార్యదర్శి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.