
నూరుశాతం ఉద్యోగాల జీవో వెంటనే తేవాలి
● గిరిజన అభ్యర్థులఉద్యమానికి సంపూర్ణ మద్దతు ● పార్లమెంట్ స్థాయిలో పోరాడుతా ● అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లో జీవో నంబరు 3 అమలుజేస్తామని అరకు సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇచ్చిన హమీ మేరకు నూరుశాతం ఉద్యోగాల జీవోను వెంటనే తేవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ తనూజరాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఫోన్‌లో సాక్షితో మాట్లాడుతూ జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోతో నూరుశాతం గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత అంతా కూటమి ప్రభుత్వంపైనే ఉందన్నారు. మెగా డీఎస్సీ ప్రకటనకు ముందే కూటమి ప్రభుత్వం గిరిజనులకు న్యాయం చేయకుండా కాలయాపన చేయడంతో గిరిజన అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక డీఎస్సీ కోసం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులమంతా గిరిజన అభ్యర్థుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చామన్నారు. జీవో నంబరు 3 సాధన, ప్రత్యేక డీఎస్సీ కోసం భవిష్యత్తులోను వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని, పార్లమెంట్ స్థాయిలో తన పోరాటం కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు.