
చిత్తడి దారులతో అవస్థలు
● బురదమయంగా రహదారి ● జారిపడి గాయాలపాలవుతున్న వాహనచోదకులు ● ఆందోళనలో గ్రామస్తులు ● పట్టించుకోని అధికారులు
చింతపల్లి: మండలంలో అతి మారుమూల ఉన్న దిగజనబ–కోరుకొండ గ్రామాల మధ్య రహదారి అద్వానంగా మారింది. రాకపోకలు సాగించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలపం పంచాయతీ పరిధిలో గల గిరిజనులు పంచాయతీ కేంద్రంలోని కోరుకొండకు చేరుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు.ఏ ఒక్క గ్రామానికి పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం లేక ఆయా ప్రాంతవాసులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ సచివాలయానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, వారపు సంతకు చేరుకోవాలంటే కాలినడకన లేకుంటే అప్పడప్పుడు ఈ మార్గంలో తిరిగే ఆటోలు జీపులే ఆధారంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ రహదారి చిత్తడిగా మారింది. దీంతో వాహనచోదకులు జారిపడి గాయాలపాలవుతున్నారని పలువురు చెబుతున్నారు. ఆటోలు జీపులు బురదలో చిక్కుకుపోయి అటూ ఇటూ కదలక నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. దిగజనబ, ఎగజనబ, గిల్లలబంద, చెరువూరుతో పాటు ఒడిశాకు సంబంధించిన అనేక గ్రామాలు గిరిజనుల ఈ మార్గం మీదుగానే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా మారడంతో గిరిజనులు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో ఏఒక్కరికి ఆనారోగ్యం వచ్చినా కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడానికి డోలి మోతలే శరణ్యమవుతుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చింతపల్లి మండల కేంద్రానికి చేరుకోవాలన్నా ఈ రహదారి ద్వారానే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదని పలు గ్రామాలు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలిని స్థానికులు కోరుతున్నారు.

చిత్తడి దారులతో అవస్థలు