
జీపు బోల్తా– ఒకరు మృతి
జి.మాడుగుల: పాడేరు రోడ్డు మార్గంలో మంగళవారం మిట్టమామిడి జంక్షన్ వద్ద జీపు బోల్తా పడిన సంఘటనలో గిరిజన మహిళ మృతి చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ షణ్ముఖరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోదకొండమ్మ పండగకు వెళ్లి ప్రయాణికులతో వస్తున్న జీపు మంగళవారం తెల్లవారుజామున కె.కోడాపల్లి పంచాయతీ మిట్టమామిడి జంక్షన్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాద సంఘటనలో చింతపల్లి మండలం బయలుకించంగి పంచాయతీ పినకొత్తూరు గ్రామానికి చెందిన కొర్ర లక్ష్మి(27) తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో కొర్ర నందిని, పద్మకు గాయలైనట్టు చెప్పారు. గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై మృతురాలి భర్త రంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు.